స్మార్ట్‌ఫోన్లతో ఎన్ని ఉపయోగాలున్నాయో.. అదేస్థాయిలో మైనస్ పాయింట్లూ ఉన్నాయి. ప్రధానంగా ఛార్జింగ్ సమస్య అనేది స్మార్టు ఫోన్లకు పెద్ద మైనస్. ఒకవేళ అధిక సామర్థ్యం ఉన్న బ్యాటరీలను వాడి ఆ లోపాన్ని సరిదిద్దుదామంటే అప్పుడు ఫోన్ సైజ్, బరువు బాగా పెరిగిపోతుంది. దీంతో స్మార్టు ఫోన్లలో బ్యాటరీ బ్యాకప్ తక్కువగానే ఉంటోంది. అందుకే స్మార్టుఫోన్ యూజర్లు ఎక్కడకు వెళ్లినా ఛార్జరో.... పవర్ బ్యాంకో తమతోపాటు తీసుకెళ్తున్నారు. అయితే.. ఇకపై ఆ బాధలు కొంతమేర తప్పనున్నాయి. ఛార్జర్ అవసరం లేకుండా వైఫైతో ఛార్జింగ్ చేసుకునే వెసులుబాటు రానుంది. వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పలువురు పరిశోధకులు పో వైపై (Po WiFi) పేరుతో సరికొత్త టెక్నాలజీ డెవలప్ చేశారు. దీని ద్వారా వై-ఫై రూటర్ సహాయంతో వివిధ వై-ఫై డివైస్‌లను వైర్‌లెస్‌గా చార్జ్ చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే భవిష్యత్‌లో అన్ని రకాల స్మార్ట్‌ఫోన్‌లను సులభంగా ఛార్జింగ్ చేసుకోవచ్చు. మరోవైపు స్మార్టుఫోన్ల ఛార్జింగ్ కోసం ఇంకో విధానాన్నీ అభివృద్ధి చేస్తున్నారు. సోలార్ పవర్ ను అందించే ఓ విండో ప్లగ్ సాకెట్‌ను తయారుచేశారు. ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే సైజులో ఉండే ఈ పోర్టబుల్ సోలార్ సాకెట్ సూర్యరశ్మిని గ్రహించి ఆ సోలార్ శక్తిని తనలో నిల్వ చేసుకుంటుంది. అత్యవసర సమయంలో ఈ విండో ప్లగ్ సాకెట్ ద్వారా మొబైల్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ డివైస్‌లను ఛార్జి చేసుకోవచ్చు. |