ఆపద... ఎప్పుడు, ఎలా వస్తుందో తెలియదు.. ప్రమాదం ఏ క్షణాన ఎలా సంభవిస్తుందో తెలియదు. ఒక వేళ తెలిసినా వెంటనే స్పందించే అవకాశం మనకు ఉండదు. కనీసం ఫోన్ ఓపెన్ చేసి నెంబర్ డయిల్ చేసే ఛాన్స్ కూడా ఉండదు. కానీ త్వరలో రాబోయే స్మార్టుఫోన్లు మనల్ని ఆపదలో ఆదుకునేలా తయరు కాబోతున్నాయట. 2017లో తయారయ్యే స్మార్టుఫోన్లలో పానిక్ బటన్ అనే ఆప్షన్ రాబోతోంది. దీని వల్ల మనం ఏదైనా ఆపదలో చిక్కుకుంటే ఫోన్‌కి ఉన్న ఈ బటన్‌ను ఒక్కసారి నొక్కితే చాలు. సమీప పోలీస్ స్టేషన్‌కు కాల్ వెళుతుంది. ఎవరో ఆపదలో ఉన్నారని వారికి అర్ధమవుతుంది. మన ఫోన్ ట్రాకింగ్ వివరాలు కూడా పోలీసులకు అందుతాయి. దీంతో వారు వెంటనే స్పందించి ఆపదలో ఉన్నవారిని ఆదుకునే అవకాశం ఉంటుంది. ఫోన్లలో ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కొత్త నిబంధనలు తయారు చేసింది. ప్రతి స్మార్టుఫోన్‌లో కచ్చితంగా పానిక్ బటన్‌తో పాటు గ్లోబల్ పోజిషినింగ్ సిస్టమ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జనవరి 1, 2017 నాటికి భారత్‌లో అమ్మే ఫోన్లలో కచ్చితంగా ఈ ఆప్షన్లు ఉండాలని నిర్దేశించింది. ఒకవేళ ఇప్పటికే కొన్ని కంపెనీలు ఫోన్ల తయారీ పూర్తి చేసినట్లయితే జనవరి 1, 2018 నాటికి పూర్తి స్థాయిలో ఈ నిబంధనలు అమలు కావాలని చెప్పింది. మహిళల రక్షణ ప్రధాన ధ్యేయంతో ఈ కొత్త నిబంధనలు రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం తయారు చేస్తున్న మొబైల్ ఫోన్లు ఎక్కువగా ఇంటర్నెట్ వాడకాన్ని దృష్టిలో ఉంచుకునే తయారు చేస్తున్నారు. డెస్క్ టాప్ మాదిరిగా ఎక్కువ స్టోరేజ్ ఉండేలా కూడా ఈ మొబైళ్లను రూపొందిస్తున్నారు. కెమెరాకు కూడా ఎక్కువ విలువ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పానిక్ బటన్ అనేది కూడా తప్పనిసరి ఆప్షన్‌గా స్మార్టుఫోన్ కంపెనీలు పెట్టుకోవాలని ప్రభుత్వం చెప్పింది. ఈ ఆప్షన్ 5 లేదా 9 నెంబర్ నొక్కితే పని చేసేలా ఉండాలని కూడా చెప్పింది. కేంద్ర స్ర్తీ, శిశు సంక్షేమ శాఖా మంత్రిత్వశాఖ సభ్యులు ఇటీవలే సెల్‌ఫోన్ తయారీదారులను కలిసి ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. జనవరి 1, 2018 నాటికి భారత్‌లో అమ్మే ఫోన్లలో కచ్చితంగా ఈ సదుపాయం ఉండాలని వారు కోరారు. ఐతే పాత ఫోన్లు ఉపయోగిస్తున్న వారికి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకుంటే ఈ సదుపాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కూడా వారు సెల్‌ఫోన్ తయారీ దారులను కోరారు. |