ప్రపంచంలో సూపర్ కంప్యూటర్ల రేసు మొదలైంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ను తయారు చేసిన ఘనత చైనాకు ఉంది. దాన్ని మించే సూపర్ కంప్యూటర్ తయారీ కోసం జపాన్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే, అంతవరకు చైనా ఊరుకుంటుందా..? తన సూపర్ కంప్యూటర్ ను అప్ గ్రేడ్ చేసి తానే నంబర్ 1 కావాలని ప్రణాళికలు రచిస్తోంది. అంతేకాదు.. యూరప్ లో టెక్నాలజీకి ప్రసిద్ధిగాంచిన ఫ్రాన్సు కూడా తన ఏర్పాట్లలో తానుంది. ఫ్రాన్సు కంటే ముందే వచ్చే ఏడాదిలో జపాన్ సూపర్ కంప్యూటర్ అందుబాటులోకి రానుండడంతో ప్రస్తుతానికి ఈ రేసులో జపానే ముందు నిలుస్తున్నట్లు చెప్పుకోవాలి.
గత ఏడాది జూన్ లో ‘‘సన్ వే తైహు లైట్’’ పేరిట చైనా సూపర్ కంప్యూటర్ ను ఆవిష్కరించింది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కంప్యూటర్ ఇదే. అంతకుముందు ఉన్న తియాన్హె-2 సూపర్ కంప్యూటర్ కంటే ఇది మూడు రెట్లు వేగవంతమైనది. కానీ... తైహూ లైట్ రికార్డు ఏడాది కూడా నిలిచేలా కనిపించడం లేదు. తైహై లైట్ కంటే అధిక వేగం గల సూపర్ కంప్యూటర్ తయారీకి జపాన్ రెడీ అవుతోంది. జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ దీనికోసం 17.2 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తోంది.
జపాన్ అంటే ఒకప్పుడు టెక్నాలజీలో జెయింట్. కానీ.. అన్ని రంగాల్లో దూకుడు ప్రదర్శిస్తున్న చైనా ఇప్పుడు టెక్నాలజీలోనూ దూసుకుపోతుండడంతో జపాన్ కిరీటం వెలవెలబోతోంది. ముఖ్యంగా ఎలక్ర్టానిక్స్ మేన్యుఫ్యాక్చరింగ్ లో చైనా ప్రపంచానికే రారాజులా మారిపోయింది. ఒకప్పుడు జపాన్ కేంద్రంగా పాపులర్ అయిన సంస్థల్లో చాలావాటికి ఇప్పుడు చైనాయే కేరాఫ్ అడ్రస్. జపాన్ కు అటు దక్షిణ కొరియా నుంచి చైనా నుంచి రెండు వైపులా పోటీ తీవ్రమవడంతో పోటీని తట్టుకుని నిలవడం కష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో మిగతా చిన్నాచితకా అన్నిట్లోనూ వాటిపై ఆధిపత్యం చెలాయించడం కంటే ఏకంగా సూపర్ కంప్యూటర్ విషయంలో ప్రపంచంలోనే తానే టాప్ అని నిరూపించుకుంటే గత ఘనకీర్తి మళ్లీ సాధించుకునే ఛాన్సుంటుందని జపాన్ భావిస్తోంది.
జపాన్ తయారుచేస్తున్న కొత్త యంత్రం పేరు ‘ఏఐ బ్రిడ్జింగ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ర్టక్చర్’(ఏబీసీఐ).. దీని డాటా ప్రాసెసింగ్ సామర్థ్యం ఎంతో వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఏకంగా 130 పెటా ఫ్లాప్స్ ప్రాసెసింగ్ సామర్థ్యం ఉండేలా దీన్ని రూపొందిస్తున్నారు. ఫ్లాప్స్ అంటే ‘ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్’. అంటే సెకను కాలంలో డాటా ప్రాసెస్ చేసే వేగానికి ఇది కొలమానం. మనకు బాగా అలవాటైన స్టోరేజి సామర్థ్యం లెక్కల్లో మాట్లాడుకుంటే.. వెయ్యి బైట్లు ఒక మెగా బైట్.. వెయ్యి మెగా బైట్లు ఒక గిగా బైట్.. వెయ్యి గిగా బైట్లు ఒక టెరా బైట్.. వెయ్యి టెరా బైట్లు ఒక పెటా బైట్. ఆ లెక్కన.. పెటా ఫ్లాప్ అంటే వెయ్యి టెరా ఫ్లాప్స్. 1000000000000000 ఫ్లాప్స్ అన్న మాట. అంతేకాదు.. విద్యుత్ వినియోగంలోనూ ఇది చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది. మూడు మెగావాట్ల కంటే తక్కువ విద్యుత్ తోనే పనిచేసేలా దీన్ని రూపొందిస్తున్నారు. చైనా సూపర్ కంప్యూటర్ సుమారు 15 మెగా వాట్ల విద్యుత్ ను వినియోగించుకుంటుంది.
ఇంతకీ ఇది ఎందుకు పనికొస్తుంది..?
గణన సామర్థ్యం ఈ రేంజిలో ఉన్నప్పుడు దీన్ని ఎలాగైనా వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా ప్రపంచమంతా ఆసక్తి చూపుతున్న డ్రైవర్ లెస్ కార్లు వంటివాటిని మరింత సమర్థంగా పనిచేయించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. భారీ మొత్తంలో ఉండే ట్రాఫిక్ డాటాను సెకనులో వందోవంతు సమయంలో ప్రాసెస్ చేయాలంటే ఆర్డినరీ కంప్యూటర్లకు సాధ్యం కాదు. మిగతా రంగాల్లోనూ దీన్ని విస్తృతంగా వాడుకోవడానకి అన్ని అవకాశాలూ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఈ జపాన్ సూపర్ కంప్యూటరుకు తాతలాంటి సూపర్ కంప్యూటర్లు కూడా అప్పుడే తయారవుతున్నాయి. ఫ్రాన్స్ కేంద్రంగా ఇది రూపుదిద్దుకుంటోంది. ఫ్రాన్స్ లోని బీజోన్స్ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఐటీ సేవలు, కంప్యూటర్ల తయారీ సంస్థ అటాస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ను తయారుచేస్తోంది. ఫ్రెంచి ఆల్టర్నేటివ్ ఎనర్జీస్, ఆటమిక్ ఎనర్జీ కమిషన్ అవసరాల కోసం దీన్ని తయారుచేస్తున్నారు. సెకనుకు ఇది లక్ష కోట్ల గణనలు చేయగలిగేలా రెడీ చేస్తున్నారు. అంటే జపాన్ ఏబీసీఐ సూపర్ కంప్యూటర్ కంటే ఏడున్నర రెట్లు వేగవంతమైందన్నమాట. కానీ.. ఇది అందుబాటులోకి రావడానికి 2020 వరకు వేచిచూడాల్సిందే. ఈలోగా 2018లో జపాన్ కు చెందిన సూపర్ కంప్యూటర్ ఏబీసీఐ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. అంటే అక్కడి రెండేళ్లలో జపాన్ సూపర్ కంప్యూటర్ సెకండ్ ప్లేస్ లోకి రావాల్సిందే.
డిజిటల్ ఇండియా పేరుతో టెక్నాలజీలో తనదైన ముద్ర వేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఇండియా ఈ రేసులో చాలా వెనుకబడి ఉంది. ఇండియాలోనూ సూపర్ కంప్యూటర్లు ఉన్నా పెటాఫ్లాప్స్ వేగం ఉన్నవి లేవు. మన దగ్గర సహస్ర-టీ పేరుతో 901 టెరా ఫ్లాక్స్ వేగంగల సూపర్ కంప్యూటరే అత్యంత వేగవంతమైనది.ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ దీన్ని వినియోగిస్తోంది.