• తాజా వార్తలు

ఈ ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ డ్రోన్‌తో సెల్ఫీ మజాయే వేరు

డ్రోన్ అన‌గానే మ‌న‌కు ఆకాశంలో ఎగురుతూ మ‌న‌కు కావాల్సిన స‌మాచారాన్ని చిత్రించే ప‌రిక‌రం గుర్తొస్తుంది. కానీ డ్రోన్ల‌తో మ‌న‌కు కావాల్సిన అన్ని ర‌కాల ఫొటోల‌ను, వీడియోల‌ను తీసుకోవ‌డం అంత సుల‌భం కాదు.  ఒక వేళ తీసుకున్నా దానిలో ఉండే స్పేస్ చాలా ప‌రిమితం. కానీ చైనాకు చెందిన జీరో జీరో రోబొటెక్స్ అంకుర సంస్థ త‌యారు చేసిన ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ డ్రోన్‌తో ఫొటోలు తీయ‌డం, వీడియోలు చిత్రీక‌రించ‌డం చాలా సుల‌భం అట‌.  ఈ డ్రోన్‌తో 13 ఎంపీ క్లారిటీతో ఫొటోలు తీస్తుంది. అంతేకాదు 4 కే వీడియోను కూడా తీయ‌గ‌ల‌దు.  హోవ‌ర్ కెమెరా పేరుతో త‌యారు చేసిన ఈ డ్రోన్‌లో 32 జీబీ సామ‌ర్థ్యం ఉంది. 

ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ ట్రాక‌ర్ ద్వారా 238 గ్రాముల బ‌రువున్న ఈ డ్రోన్‌ను ఆకాశంలోకి పంపి మ‌న‌కు న‌చ్చిన విధంగా, న‌చ్చిన రీతిలో ఫొటోలు, వీడియోలు తీసుకునే సౌక‌ర్యం ఉంది.  అంతేకాదు క‌చ్చిత‌మైన సెల్ఫీ తీయ‌డానికి కూడా ఈ సాధ‌నం ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది.  గాలి ఎక్కువ‌గా ఉన్నా.. ప‌రిస్థితులు అంత అనుకూలంగా లేక‌పోయినా ఈ హోవ‌ర్ త‌న ప‌ని తాను చేసుకుపోతుంద‌ట‌. ఈ డ్రోన్ కింద భాగంలో ఉన్న సోనార్ సెన్సార్ మ‌రియు అద‌న‌పు కెమెరాలు ఈ సాధ‌నాన్ని మ‌రింత మెరుగ్గా వాడేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని టెక్నాల‌జీ వెబ్‌సైట్ జెడ్‌నెట్‌.కామ్ తెలిపింది. 

ఈ డివైజ్‌తో 360 డిగ్రీల కోణంలో ప‌నోర‌మ త‌ర‌హా ఫొటోలు తీసుకోవ‌చ్చు. ఈ డ్రోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగ‌న్ ఫ్లాట్‌ఫాం ద్వారా ప‌ని చేస్తుంది.  అన్ని వేళ‌ల్లోనూ పూర్తి స్థాయి వేగంతో ప‌ని చేయ‌డం ఈ డ్రోన్ మ‌రో ప్ర‌త్యేక‌త‌. త‌మ సంస్థ ఈ ప‌రిక‌రాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా త‌యారు చేసింద‌ని.. త్వ‌ర‌లో ప్ర‌తి ఒక్క‌రికి సొంత రోబోను త‌యారు చేయాల‌నేది త‌మ ఉద్దేశ‌మ‌ని జీరో జీరో రొబోటెక్స్ సంస్థ తెలిపింది. హోవ‌ర్ కెమెరా తుది వెర్ష‌న్ ఈ ఏడాది చివ‌రిలో విడుదల కానుంది. ఇటీవ‌లే బీజింగ్‌లో ముగిసిన గ్లోబ‌ల్ మొబైల్ ఇంట‌ర్నెట్ కాన్ఫ‌రెన్స‌లో ఈ డ్రోన్‌ను ప్ర‌ద‌ర్శించారు.

 

జన రంజకమైన వార్తలు