ద్విచక్ర వాహనాలు నడిపే వారు తప్పనిసరిగా అన్ని పత్రాలు వెంట ఉంచుకోవాలి. బండికి సంబంధించి ప్రతి డాక్యుమెంట్ తప్పనిసరిగా క్యారీ చేయాలి. లేకపోతే ట్రాఫిక్ పోలీసుల నుంచి చలానాల బెడద తప్పదు. చాలామంది లైసెన్స్ దగ్గర పెట్టకుంటే, ఆర్‌సీ మరిచిపోవడమో.. లేక ఈ రెండూ జాగ్రత్తగా ఉంచుకుంటే, పొల్యూషన్ సర్టిఫికెట్టో లేకపోతే బండి ఇన్యూరెన్స్ సర్టిఫికెట్టో మరిచిపోవడం జరుగుతూ ఉంటుంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటే కచ్చితంగా చలానా రూపంలో చేతి చమురు వదలడం ఖాయం! ఈ నేపథ్యంలో ఈ బాధలన్నిటిని తీర్చడానికి జాతీయ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ఒక యాప్‌ను తయారు చేసింది. ఈ యాప్ మన స్మార్టుఫోన్‌లో ఉంటే చాలు.. లైసెన్స్, పొల్యూషన్, ఆర్‌సీ, ఇన్యూరెన్స్.. ఇలా ఒకటేమిటి..బండికి సంబంధించిన సమస్త సమాచారాన్ని ఈ యాప్ ద్వారా నిక్షిప్తం చేసుకోవచ్చు. జాతీయ ఇన్ఫర్మేటిక్ సెంటర్ యాప్ ద్వారా వాహనదారుల కష్టాలు తీరుతాయని భావిస్తున్నారు. వాహనదారుల సౌకర్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన ఎంవాలెట్ యాప్ కంటే ఇది చాలా ఉపయోగకరమని జాతీయ ఇన్ఫర్మేటిక్ సెంటర్ తెలిపింది. మరో ఆరు నెలల్లో ఈ యాప్ భారత్‌లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందట. ఐతే వాహనదారుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంవాలెట్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటుందట. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న టాప్-20 యాప్‌లలో ఇది ఒకటని గూగుల్ ప్రకటించింది. ఇప్పటికే 6 లక్షలసార్లు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేశారు. ఐతే జాతీయ ఇన్ఫర్మేటిక్ సెంటర్ తయారు చేసిన కొత్త యాప్‌తో వాహనదారుల అవసరాలు తీర్చడమే కాక 20 రకాల సర్వీసులకు కూడా దీన్ని ఉపయోగించొచ్చట. వీటిలో కొత్త లైసెన్స్‌కు దరఖాస్తు చేయడం, లైసెన్స్ రెన్యువల్ చేయించడం లాంటి సర్వీసులు కూడా ఉన్నాయి. ఎంవాలెట్ గురించి ఇప్పటికే వినియోగదారులకు ఒక అంచనా ఉండటంతో కచ్చితంగా తమ యాప్ మరింత ఎక్కువగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు జాతీయ ఇన్ఫర్మేటిక్ సెంటర్ చెప్పింది. |