స్ప్లిట్ స్క్రీన్ ద్వారా తెరను విభజించి రెండు యాప్‌లను ఒకేసారి వాడుకునే వీలు రీసెంటుగా వచ్చిన ఆండ్రాయిడ్ మార్ష్‌మెల్లో(ఆండ్రాయిడ్ 6) ఇంకా పూర్తిగా వ్యాపించకముందే ఆ తరువాత వెర్షన్ వచ్చేసింది. ఆండ్రాయిడ్ ఎన్ ఆపరేటింగ్ సిస్టమ్ బీటా వెర్షన్ వచ్చేసింది. ఇందులో ఒకేసారి రెండు అప్లికేషన్లను వాడుకునేందుకు వీలుగా స్ప్లిట్ స్క్రీన్ ద్వారా తెరను విభజించి రెండు యాప్‌లను ఒకేసారి వాడుకునే వీలుంటుంది. ఒక యాప్ నుంచి మరో యాప్‌కు సమాచారాన్ని సులభంగా కాపీ చేసుకోవచ్చు. అలాంటి ఫీచర్‌నే మరింత ఆకర్షణీయంగా ఆండ్రాయిడ్ ఎన్ లోనూ అందిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. నోటిఫికేషన్లు.. బ్యాటరీ బ్యాకప్‌ను మెరుగుపరచడంతోపాటు పలు కొత్త ఫీచర్లనూ అందిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో వున్న బీటా వెర్షన్ ఒఎస్‌ను డెవలపర్లు డౌన్‌లోడ్ చేసుకుని..మార్పులు చేర్పులకు సంబంధించి సూచనలు చేయాలని గూగుల్ కోరుతోంది. మార్పులు చేసిన తర్వాత ఈ వేసవిలోనే స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలకు పూర్తి స్థాయి వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇక ఇప్పటి వరకూ వచ్చిన ఆండ్రాయిడ్ వెర్షన్లన్నీటికీ వరుసగా తినుబండారాల పేర్లు పెడుతూ వచ్చిన గూగుల్…ఈ కొత్త వెర్షన్ పేరును మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఏటా వేసవిలో జరిగే డెవలపర్ల సదస్సులో గూగుల్ తన తదుపరి ఆండ్రాయిడ్ వెర్షనపై చర్చిస్తుంటుంది. అయితే…ఈ సారి అంతకు ముందుగానే ఆండ్రాయిడ్ ఎన్ ను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎన్ తో వచ్చే తినుబండారాల పేరునే దీనికీ పెడతారు. కాగా ఆండ్రాయిడ్ అంటే మానవ లక్షణాలు సంపాందించుకునే రోబోట్ అని అర్థం. గూగుల్ ఈ పేరుతో మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని క్రియేట్ చేసిన తరువాత ఇదిప్పుడు ప్రపంచంలో అత్యంత పాపులర్ పదంగా మారిపోయింది. |