• తాజా వార్తలు

ఆ మంటతో వంటే కాదు, ఫోను ఛార్జింగూ చేసుకోవచ్చు

స్మార్టు ఫోన్లు ప్రపంచమంతా అల్లుకుపోయిన తరువాత దానికి అనుబంధంగా ఎన్నో సేవలూ అందుతున్నాయి. ముఖ్యంగా స్మార్టుఫోన్లకు అనుసంధానంగా వస్తున్న యాక్సెసరీస్ కూడా పలు ఇతర అవసరాలు తీర్చగలుగుతున్నాయి. స్మార్టు ఫోన్ నుంచి లైట్ వెలిగించడం... చిన్నపాటి ఫ్యాన్ ను తిప్పడం.. వంటి ఎన్నో చేయడానికి వీలవుతోంది. అలాంటి యాక్సెసరీస్ కూడా ఆన్ లైన్లో దొరుకుతున్నాయి. అయితే... ఎన్ని చేసినా స్మార్టు ఫోన్ ను చార్జి చేసుకోవడానికి మాత్రం అవకాశాలు పరిమితంగానే ఉంటున్నాయి. నేరుగా విద్యుత్ ప్లగ్ పాయింట్ కు కనెక్ట్ చేయడమో లేదంటే.. ఏవైనా ఇతర ఎలక్ర్టానిక్ డివైస్ ల నుంచి చార్జింగ్ చేసుకోవడమో.. పవర్ బ్యాంక్ ల నుంచి చార్జి చేసుకోవడమో మాత్రమే చూస్తున్నాం. సోలార్ పవర్ ను ఫోన్ చార్జింగ్ కు వాడుతున్నా అదీ పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ... తాజాగా  అగ్ని నుంచి ఫోన్ ఛార్జి చేసుకునే డివైస్ వచ్చేసింది. స్టవ్ వెలిగించి ఆ మంటపై వంట చేసుకుంటూనే పనిలో పనిగా ఆ మంటను ఉపయోగించే మన స్మార్టు ఫోనునూ ఛార్జింగు చేసుకోవచ్చు. ఒక్క ఫోనే కాదు, యూఎస్బీ కేబుల్ సహాయంతో ల్యాప్ టాప్ లను కూడా ఛార్జి చేసుకోవచ్చు.

ఇంతకీ ఇలా మంటతో ఫోన్ ఛార్జింగ్ చేసుకునే వీలుకల్పించే పరికరం పేరు 'బయోలైట్ క్యాంప్ స్టవ్'.  ఈ పరికరంతో  ఓ వైపు  వంట వండుతూనే మరోవైపు దాని ద్వారా ఆయా డివైస్‌లకు ఎంచక్కా చార్జింగ్ పెట్టుకోవచ్చు. స్టవ్‌లో మంట పెట్టడం వల్ల ఉద్భవించే వేడిని విద్యుత్ శక్తిగా మార్చే పరికరం అందులో ఉంటుంది.  అలా మార్చిన విద్యుత్ శక్తిని ఎలక్ర్టానిక్ పరికరాలకు అందించేందుకు అనుసంధానకర్తలుగా  యూఎస్‌బీ పోర్టులు ఉంటాయి.  సాధారణ యూఎస్ బీ కేబుల్ సహాయంతో ఆ శక్తిని ఫోన్, పవర్‌బ్యాంక్, యూఎస్‌బీ లైట్, ల్యాప్ టాప్ వంటివాటికి మళ్లించవచ్చు.

ముఖ్యంగా ఇది విద్యుత్ అందుబాటులో లేని ప్రాంతాలకు వెళ్లినప్పుడు బాగా ఉపయోగపడుతుంది.  అలాంటి చోట ఫోన్‌లలో చార్జింగ్ అనేది సమస్యగా మారుతుంది. దీనికి తోడు ఆయా ప్రదేశాల్లో  ఆహారం లభ్యమవడమూ కష్టమే.  బయోలైట్ క్యాంప్ స్టవ్ సహాయంతో ఆహారం రెడీ చేసుకోవడంతో పాటు కమ్యూనికేషన్లకు కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు.

ఈ స్టవ్ కేవలం 4.5 నిమిషాల్లోనే 1 లీటర్ నీటిని మరిగించగలదు. అంతేకాదు దీనికి ఫోన్‌ను 20 నిమిషాల పాటు చార్జింగ్ పెడితే చాలు, దాంతో 60 శాతం వరకు ఫోన్ బ్యాటరీకి కావల్సిన శక్తి లభిస్తుంది. అయితే ఈ స్టవ్ ధర మాత్రం కాస్తంత ఎక్కువే. రూ.20 వేలకు పైగానే ఉంది.  మన దేశంలో అమెజాన్ వంటి ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్లలో ఇది దొరుకుతోంది. అడవుల్లోకి వెళ్లేవారు.. నదులు, సముద్రాలపై తిరిగేవారికి ఇది ప్రయోజనకరం.  దీన్ని మంచి సర్వైవల్ గాడ్జెట్ గా చెప్పొచ్చు.

జన రంజకమైన వార్తలు