తీవ్రమైన ఆస్తమాతోనూ, పల్మనరీ వ్యాధితోనూ బాధపడే రోగులు వ్యాధి తీవ్రంగా ఉన్న సమయంలో తక్షణ ఉపశమనం పొందేందుకు, ఇన్‌హేలర్ నోట్లోపెట్టుకొని మందు లోపలకు పీల్చడం మనలో చాలామందికి తెలుసు. అయితే ఇలా ఇన్‌హేలర్‍తో మందు లోపకు పీల్చడం వల్ల మందు యొక్క మోతాదుపై రోగులకు నియంత్రణ తక్కువగా ఉంటుంది. మందు మోతాదు ఎక్కువ, తక్కువలు కాకుండా పీల్చాలంటే రోగికి కొంత అనుభవం కావాలి. అసలేతీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న రోగులకు మందు మోతాదు గురించి ఆలోచించి, కంగారుపడటం మరింత ఒత్తిడిని,ఆందోళను పెంచుతుందని మనం ఊహించవచ్చు. ఈ సమస్యల పరిష్కారానికి అంతర్జాతీయ ఔషధ సంస్థ గ్లెన్ మార్క్ ఫార్మా స్యూటికల్స్ ఆస్తమా, పల్మనరీ రోగుల కోసం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా డిజిటల్ డోస్ ఇన్‌హేలర్‍ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. " "డిజిహేలర్" అనే బ్రాండ్ నేమ్‌తో మార్కెట్లోకి వస్తున్న ఈ ఇన్‌హేలర్‍లో కచ్చితమైన డోసేజి కోసం డిజిటల్ డోస్ కౌంటర్ ఉంటుంది. దీనివల్ల రోగి తను ఎంత మందు లోపలకి పీల్చుకున్నాడో కచ్చితంగా తెలుస్తుంది. దీనితో పాటు "లో-డోస్ వార్నింగ్" అనే ఫీచర్ వల్ల ఒక నిర్ణీతసమయంలో కానీ, రోజు మొత్తంలో కానీ రోగి తీసుకోవాల్సిన డోస్ కన్నా తక్కువ డోస్ తీసుకున్నప్పుడు అలారం మోగి హెచ్చరిస్తుంది. ఈ సౌకర్యాల వల్ల రోగులు తమ ట్రీట్‌మెంట్ ప్లాన్‍కి కచ్చితంగా కట్టుబడి ఉండటం సాధ్యమౌతుందని కంపెనీ చెబుతోంది. గ్లెన్ మార్క్ ఫార్ములేషన్స్ భారతీయ విభాగం అధిపతి సుజేష్ వాసుదేవన్ మాట్లాడుతూ "ఔషథ పరిశ్రమలో డిజిటల్ విప్లవం కీలకపాత్ర పోషిస్తుందని మేం భావిస్తున్నాం. ఆస్తమా, పల్మనరీ వ్యాధులలో మందు మోతాదు ట్రీట్‌మెంట్ ప్లాన్‍కి కచ్చితంగా దగ్గరగా ఉండేలా చూసుకోవడం సంప్రదాయ పద్ధతిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. వివిధ వయసుల వారిలో ఆస్తమా, పల్మనరీ వ్యాధులను పూర్తిగా నియంత్రించలేకపోవడానికి ఇదే ప్రధాన కారణం. మా కొత్త ఉత్పత్తి ఈ సమస్యను అధిగమించేందుకు ఉపయోగిస్తుందని విశ్వసిస్తున్నాం" అన్నారు. |