'సీనియర్ వరల్డ్ డాట్ కామ్' వారి 'ఈజీ ఫోన్' టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో సీనియర్ సిటిజన్లు కూడా ముందుంటున్నారు. అయితే.... కొన్ని డిజైన్లు వారికి అనుకూలంగా ఉండడం లేదు. ముఖ్యంగా ఫోన్ల విషయమే తీసుకుంటే చిన్న అక్షరాలు వంటివి వారిని ఇబ్బంది పెడుతుంటాయి. వృద్ధాప్యం వల్ల వచ్చే దృష్టి లోపాలు, చేతులు వణకడం వంటి కారణాలతో చాలామంది వృద్ధులు ఫోన్లను సరిగ్గా ఆపరేట్ చేయలేకపోతుంటారు. ఇలాంటివాటికి పరిష్కారంగా వృద్ధుల కోసం 'సీనియర్ వరల్డ్ డాట్ కామ్' ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించింది. అందులో 'ఈజీ ఫోన్' ఒకటి. ఈ హ్యాండ్‌సెట్ వినియోగం చాలా సులభం. వినడం, టెక్ట్స్ చదవడం చాలా ఈజీ. సింగిల్ కీ ప్రెస్ చేస్తే చాలు.. ఫొటో డయలింగ్ అవుతుంది. క్రెడిల్ చార్జింగ్ మరో ప్రత్యేకత. చార్జర్లు మరిచిపోయినా టెన్షన్ లేదు. వైర్లు, ప్లగ్గులు, స్విచ్చుల జంజాటం లేదు. అచ్చం... అప్పట్లో కార్డ్ లెస్ ఫోన్లు వాడినట్టే. అవతలివాళ్లు మాట్లాడితే స్పష్టంగా వినిపిస్తుంది. పెద్ద స్క్రీన్, బ్యాక్ లైటింగ్ కీస్, టాకింగ్ కీ ప్యాడ్, ఏ నంబర్ ప్రెస్ చేశామో తెలిసేటట్టు ఆడియో వినిపించడం దీని ప్రత్యేకత. నంబర్ ప్రెస్ అయిందా లేదా అనే సందేహమే అక్కర్లేదు. కీస్ మధ్య కావాల్సినంత ఎడం. ఒకదాని బదులు ఒకటి నొక్కే ఆస్కారం లేదు. నంబర్లు వెతుక్కోవాల్సిన పనిలేదు. ప్రతి నంబర్ వెనకాల లైట్ బ్లింక్ అవుతుంది. స్క్రీన్ మీద కనిపించే ఫాంట్ సైజ్ కూడా పెద్దదే. అంతేకాదండోయ్ ... ఈ ఫోన్‌లో మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ట్రిగర్ ఆఫ్‌లో ఉన్నా ఐదుగురికి ఫోన్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం ఎక్కడున్నాం.. ఫోన్లో బ్యాటరీ పరిస్థితి ఏమిటి... దగ్గర్లో ఉన్న మెడికల్ సర్వీసులేమిటి? తదితర వివరాలు ఎస్‌ఎంఎస్ రూపంలో వస్తుంటాయి. ఒకవేళ ఫోన్ మోగినా లిఫ్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఆటోమేటిగ్గా దానంతట అదే కాల్ లిఫ్ట్ అవుతుంది. లౌడ్ స్పీకర్ ఆన్ అవుతుంది. అవతలి వ్యక్తి గొంతు స్పష్టంగా వినిపిస్తుంది. కాంటాక్ట్ లిస్టులో ఉన్న పేర్లను వెతుక్కోవాల్సిన పనిలేదు. సింగిల్ ప్రెస్‌తోనే ఫొటో కాంటాక్ట్ సిస్టం ద్వారా కాల్ వెళ్తుంది. 8 మంది ఇంపార్టెంట్ వ్యక్తుల ఫొటోలతో కూడిన కాల్ సెండింగ్ ఆప్షన్ ఈ ఫోన్‌లో ఉంది. |