దేశంలో మొబైల్ కనెక్షన్ల సంఖ్య 100 కోట్లు దాటిపోయింది. 2జీ, 3జీ దాటి 4జీ టెక్నాలజీ మొబైల్ ప్రియులను అలరిస్తోంది. ఒక ఎంబీ డేటా వాడాలంటే ఖర్చుకు బెంబేలెత్తే జనం కంపెనీల ప్రైస్‌వార్ పుణ్యమా అని రోజుకు ఒక జీబీ డేటాను అలవోకగా ఖర్చు పెట్టేస్తున్నారు. 2జీని మించి 3జీ దానికంటే ఎక్కువ వేగంతో 4జీ సెల్‌ఫోన్లను అన్నింటికీ అనువుగా మార్చేశాయి. ఇక ఇప్పుడు కంపెనీల దృష్టి 5జీ నెట్‌వర్క్‌పై పడింది. త్వరలోనే 5జీ నెట్‌వర్క్ కూడా దేశంలోకి రానున్న నేపథ్యంలో దానికి తగిన కంపాటబులిటీ తో కూడిన ఫోన్ల తయారీపై మొబైల్ కంపెనీలు, యాప్ ల డిజైనింగ్‌పై ప్రోగామర్లు సీరియస్‌గా సిద్ధమైపోతున్నారు. మొత్తంగా దేశంలో మరో డిజిటల్ విప్లవానికి కంపెనీలు సిద్ధమవుతున్నాయి.
రాబోయే టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ను దృష్టిలో పెట్టుకుని యాప్‌లు తయారవుతున్నాయని చైనీస్ మొబైల్ కంపెనీ హువావేలో ఇండియాకు మార్కెటింగ్ డైరెక్టర్ గా పని చేస్తున్న చందన్‌కుమార్ చెబుతున్నారు.
5జీతో మరింత ముందుకు..
4జీతో డిజిటల్ ట్రాన్సాక్షన్లు సాధ్యమయ్యాయి. టికెట్ బుకింగ్, బిల్ పేమెంట్స్, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లు అన్నీ కూర్చున్నచోట నుంచే చిటికెలో చేసుకోగలుగుతున్నాం. ఇక 5జీ వస్తే మొబైల్ కస్టమర్‌ను వర్చువల్ రియాల్టీలోకి లాక్కెళ్లడం ఖాయం. ఆటేమేటెడ్ కార్లు, ఆన్‌లైన్‌లో చూసి సర్జరీలు చేసేయడం వంటివి కూడా 5జీతో సాధ్యమవుతాయి. అయితే వీటన్నింటికీ నెట్ వర్క్ స్పీడ్, క్వాలిటీ కూడా చాలా అవసరం. కాబట్టి ఆపరేటర్లు ఆ దిశగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని ఎయిర్‌సెల్ సీటీవో సమీర్ దేవ్ చెప్పారు.
సర్వీస్ బాగుంటేనే లాభాలు
4జీతో పాటు వైఫై కూడా కలిసి మనుగడలో ఉన్నాయి. మారుమూల ప్రాంతాలకు కూడా మోబైల్ కనెక్టివిటీతో పాటు వైఫై కూడా చేరాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కొన్ని మారుమూల ప్రాంతాల్లో 4జీ నెట్‌వర్క్ కనెక్టివిటీ లేదు. దీన్ని సాధించగలిగితేనే తర్వాత వచ్చే 5జీ ప్రయోజనాలు కస్టమర్లకు అందుతాయి.
కంటెంట్ ఉంటే చాలు..
మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీకి 4జీ బ్యాక్ బోన్ గా నిలిచిందనే చెప్పాలి. 3జీ మొబైల్ ఫోన్లు మార్కెట్‌ను కాప్చర్ చేయడానికి దాదాపు మూడేళ్లు పడితే 4జీ డివైస్‌లు కేవలం ఎనిమిది నెలల్లోనే 70 నుంచి 75 శాతం మార్కెట్‌ను చేజిక్కించుకోగలిగాయి. టెక్నాలజీ చాలా దూరంగా కనిపించినా చాలా వేగంగా రీచ్ అవుతుంది. అందువల్ల కస్టమర్లకు అవసరమైన కంటెంట్ అందుబాటులో ఉంచడం కీలకమని కంపెనీలు భావిస్తున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సెక్రటరీ సుధీర్‌గుప్తా కూడా ఇదే మాట అంటున్నారు. వినియోగదారుడికి కావలసినదేంటో గ్రహించి అందిస్తే ఈ రంగంలో విజయం వెన్నంటే ఉంటుందని ఇప్పటికే చాలా సార్లు రుజువైంది కూడా.