ప్రపంచంలో ఫాస్టెస్ట్ ఫ్రీ వైఫై సర్వీస్ దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో అందుబాటులోకి వచ్చింది. సెకనుకు 100 ఎంబీ కంటే ఎక్కువ స్పీడ్‌తో ఈ వైఫై పని చేస్తుంది. విమానం కోసం వేచి ఉండే ప్రయాణికుల కోసం అన్ని టెర్మినల్స్‌లోనూ దీన్నిఏర్పాటు చేశారు. దుబాయ్‌లో ఇంట్లో ఇంటర్నెట్‌తో వాడుకునే వైఫై కంటే పది రెట్లు వేగంతో పని చేయడం విశేషంగా చెప్పుకోవాలి. అందుకే దీన్ని వైఫై అని కాకుండా వావ్ ఫై అంటున్నారు.
ఈ ఎయిర్‌పోర్ట్‌లో వచ్చే వైఫై స్పీడ్ ప్రపంచంలో ఏ ఇతర ఎయిర్‌పోర్ట్‌లోనూ రాదని దుబాయ్ ఎయిర్‌పోర్ట్ గర్వంగా ప్రకటిస్తోంది. దుబాయ్ ఇంటర్నేషనల్, దుబాయ్ వరల్ఢ్ సెంట్రల్ అనే రెండు ఎయిర్‌పోర్ట్‌లలో గత డిసెంబర్‌లో ఈ అన్‌లిమిటెడ్ హైస్పీడ్ వైఫైను ప్రారంభించారు.
ఆరువేల యాక్సెస్ పాయింట్లు
ఇంత స్పీడ్ ను మెయింటెయిన్ చేయడం కోసం 6వేల వైఫై యాక్సెస్ పాయింట్లను ఈ రెండు విమానాశ్రయాల్లో ఏర్పాటు చేశారు. ప్రపంచంలో అతిపెద్ద విమానాశ్రయమైన దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో రోజూ కొన్ని వేల మంది ప్రయాణికులు ప్రపంచం ఈ మూల నుంచి ఆ మూలకు ప్రయాణిస్తుంటారు. వీరి సౌకర్యం కోసం ఫ్రీ అన్‌లిమిటెడ్ వైఫై ను గతేడాది ప్రారంభించారు. అయితే మరే ఎయిర్‌పోర్ట్‌లోనూ దొరకనంత బెస్ట్ వైఫై ఎక్స్‌పీరియన్స్ ను మా దగ్గరకొచ్చే ప్రయాణికులకు అందించాలనే లక్ష్యంతోనే ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి అత్యంత వేగవంతమైన వైఫైను ఏర్పాటు చేశామని దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ టెక్నాలజీ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ మైకేల్ ఐబిట్సన్ చెప్పారు. వావ్ ఫైను ప్రవేశపెట్టి రెండు నెలలయింది. రోజూ యావరేజ్‌న దాదాపు లక్షమంది దీన్ని వినియోగించుకుంటున్నారు. 2017లో దాదాపు 9 కోట్ల మంది ప్రయాణికులు ఈ ఫాస్టెస్ట్ వైఫై ఎక్స్‌పీరియన్స్‌తో ఇంప్రెస్ అవుతారని దుబాయ్ ఎయిర్‌పోర్ట్ అంచనా.