ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా రోటర్ వాడకం మాములైపోయింది. ఒకేసారి కంప్యూటర్, ట్యాబ్, స్మార్ట్‌ఫోన్లలో ఇంటర్నెట్ వాడాలంటే కచ్చితంగా రోటర్ ఉండాల్సిందే. ఇప్పుడు చాలా రకాల రోటర్లు మార్కెట్లోకి వచ్చాయి. పోటీ దృష్ట్యా ఒకదానితో ఒకటి పోటీపడి మరీ రేట్లు తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనీస్ మొబైల్ కంపెనీ షియోమి ఒక కొత్త రోటర్‌తో మార్కెట్లోకి వచ్చింది. ఇన్నాళ్లు భారత మార్కెట్లో స్మార్ట్‌ఫోన్లు మాత్రమే దించిన షియోమి తొలిసారిగా రోటర్‌ను కూడా ప్రవేశపెట్టింది. షియోమి ఎంఐ రోటర్ 3సీ పేరుతో బరిలో దిగిన ఈ కొత్త ప్రొడక్ట్ వినియోగదారులను విశేషంగా ఆకర్షిస్తోంది. మిగిలిన రోటర్లతో పోలిస్తే ఇది మరిన్ని అదనపు ఫీచర్లతో తయారు చేశారు. నాలుగు యాంటినాలతో 2.4 గిగా హెట్జ్ సింగిల్ ఫ్రీక్వెన్సీతో ఇది మరింత సమర్థంగా పని చేస్తుందని షియోమి చెబుతోంది. వైఫై వాడకానికి తమ రోటర్ చక్కటి ప్రత్నామ్యాయమని ఈ కంపెనీ దీమగా చెబుతోంది.
80 మీటర్ల వరకు
సాధారణంగా రోటర్ కొంత దూరం వరకే పని చేస్తుంది. కొన్ని రోటర్లు ఒక గది నుంచి మరో గదికి వెళితే కనీసం సిగ్నల్స్‌ను అందించలేవు. కానీ షియోమి రోటర్ మాత్రం వీటన్నిటికంటే భిన్నమైంది. నాలుగు యాంటినాలతో తయారైన ఈ రోటర్ 80 మీటర్ల వరకు వైఫై సిగ్నల్స్‌ను పంపిస్తుంది. అంటే మిగిలిన రోటర్లతో పోలిస్తే ఎక్కువ దూరం వైఫై సిగ్నల్స్ అందుకునే అవకాశం ఉంది. 300 ఎంబీపీఎస్ స్పీడ్ వరకు అందించే సామర్థ్యం ఈ రోటర్‌కు ఉందని షియోమి తెలిపింది. దీనిలో మీడియా టెక్ ఎంటీ7628ఎన్ ప్రొసెసర్ వాడారు. అంతేకాక 64 ఎంజీ ర్యామ్, 16 ఎంబీ ఇంటర్నెల్ స్టోరేజ్ ఈ రోటర్ సొంతం.
రియల్‌టైమ్ మోనిటరింగ్
ఎంఐ రోటర్ 3సీ కేవలం రోటర్ మాత్రమే కాదు ఒక యాప్‌లో కూడా మన ఫోన్‌లో పని చేస్తుంది. ఈ యాప్‌ను మన ఫోన్‌లో వేసుకుంటే వైఫై ఎలా పని చేస్తుంది. ఎంత ఎంబీ ఖర్చు అయింది. డోన్‌లోడ్ స్పీడ్ ఎలా ఉంది? ఇలాంటి విషయాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు ఇంట్లో వైఫై ఉంటే మనకు పాస్‌వర్డ్ ఇబ్బందులు కూడా తప్పవు. మనకు తెలియకుండా ఎవరైనా నెట్ వాడతారనే ఆందోళన కూడా ఉంటుంది. అయితే మన వైఫైని ఎవరు కనెక్ట్ చేసుకున్నారన్న విషయం మనకు యాప్ ద్వారా రియల్ టైమ్‌లో తెలిసిపోతుంది.
ప్రతి డివైజ్‌కు డేటా విభజించుకోవచ్చు
మన ఇంట్లో కంప్యూటర్, ట్యాబ్, స్మార్టుఫోన్లు ఉంటాయి. సాధారణంగా కంప్యూటర్‌కు ఎక్కువ డేటా కావాలి. దాన్నే మనం ఎక్కువగా ఉపయోగిస్తాం కూడా. స్మార్ట్‌ఫోన్ కూడా బాగానే ఉపయోగించినా.. డౌన్‌లోడ్ చేయాలంటే మాత్రం ఎక్కువగా కంప్యూటర్‌నే వాడతాం. అయితే మనకు తెలియకుండానే మన ఇష్టం వచ్చినట్లు డేటాను వాడేస్తుంటాం. దీని మీద ఎలాంటి నియంత్రణ ఉండదు. అయితే ఎంఐ రోటర్‌లా మనం ప్రతి డివైజ్‌కు డేటాను నియంత్రించుకునే అవకాశం ఉంది. ఏ డివైజ్‌కు ఎంత అవసరమో అంత డేటాను ఉపయోగించుకునే వీలుంది. ఇన్ని ఫీచర్లు ఉన్న ఈ రోటర్ ధర మరీ ఎక్కువ కాదు. రూ.1199కే లాంచింగ్ ధరగా నిర్ణయించింది షియోమి.