సెల్ ప్రపంచంలో సరికొత్త సంచలనం ఒకటి చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఉన్న సెల్ ఆవిష్కరణలన్నిటినీ మించిపోయేలా సరికొత్త ఆవిష్కరణ ఒకటి వచ్చింది. సెల్ ఫోన్ కు ప్రాణాధారం లాంటిది బ్యాటరీ. కానీ, అసలు బ్యాటరీయే అవసరం లేని కొత్త ఫోన్ ను కనుగొన్నారు. జీరో పవర్ తో పని చేసే ఈ సెల్ ను వాషింగ్టన్ వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ శ్యామ్ గొల్లకోట కనుగొన్నారు.
కాంతి, రేడియో సిగ్నళ్ల నుంచి పవర్
మరి బ్యాటరీ లేకుండా సెల్ ఎలా పని చేస్తుంది? దానికి అవసరమైన శక్తిని ఎలా సమకూర్చుకుంటుందన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా... సింపుల్.. సెల్ ఫోన్ పరిసరాల్లో ఉన్న రేడియో సిగ్నళ్లు.. కాంతి నుంచి తనకు అవసరమైన విద్యుత్ ను గ్రహిస్తుంది.
కాల్స్ కూడా చేశారు..
తాజాగా సైంటిస్టులు కనుగొన్న బ్యాటరీ లేని ఫోన్ లో స్కైప్ లో వీడియో కాల్ కూడా చేశారట. ఫోన్ మాట్లాడే సమయంలో మైక్రోఫోన్.. స్పీకర్ ద్వారా వచ్చే చిన్నపాటి కంపనాలను సైతం తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. బ్యాటరీ లేని ఫోన్ ద్వారా ఇన్ కమింగ్ కాల్స్ తో పాటు అవుట్ గోయింగ్ కాల్స్ కూడా చేసి పరీక్షించారు.
సెల్ ఫోన్ స్వరూపమే మారిపోనుంది..
అయితే.. దీన్ని పూర్తిస్థాయి వాణిజ్య ఫోన్ గా రూపొందించేందుకు మరికొంత సమయం పడుతుందట. ఒకట్రెండు సంవత్సరాలు లేటైనా.. బ్యాటరీ లెస్ సెల్ ఫోన్ ఈ రంగంలో సునామీ మాదిరి మారి.. సెల్ స్వరూపాన్ని మొత్తంగా మార్చేయటం ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది.