• తాజా వార్తలు

ఈ ప్లాన్‌తో రూ.11,400 విలువ గల జియో గాడ్జెట్లు ఉచితం, ఇంకా ఫ్రీగా లభించేవి మీకోసం 

వినియోగదారులంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న జియో గిగాఫైబర్ సేవలు ఎట్టకేలకు  అధికారికంగా ప్రారంభమయ్యాయి.సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఈ సేవలను ప్రారంభిస్తామని గత నెలలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఆయన చెప్పినట్లుగానే ఆ సేవలను ఇవాళ ప్రారంభించారు. ఇక వాటికి గాను పూర్తి ప్లాన్ల వివరాలను కూడా జియో వెల్లడించింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. జియో ఫైబర్‌ సేవలను దేశవ్యాప్తంగా 1,600 నగరాల్లో ప్రారంభించింది. కనీసం 100 ఎంబీపీఎస్‌(మెగాబైట్స్‌ పర్ సెకన్‌) స్పీడు నుంచి గరిష్టంగా 1 జీబీపీఎస్‌(గిగాబైట్స్‌ పర్‌ సెకన్‌) స్పీడు వరకూ వివిధ రకాల ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. అన్‌లిమిటెడ్‌ బ్రాండ్‌బాండ్‌తో పాటు దేశంలో ఎక్కడికైనా ఉచిత వాయిస్‌ కాలింగ్‌, టీవీ ద్వారా వీడియోకాలింగ్‌/కాన్ఫరెన్స్‌ సదుపాయం వంటి అనేక సేవలను వినియోగదారులకు అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. 

జియో గిగాఫైబర్ సేవలకు గాను వార్షిక ప్లాన్‌ను ఒకేసారి తీసుకునే వారికి వెల్కం ఆఫర్ కింద రూ.5వేల విలువైన జియో హోం గేట్‌వే, రూ.6400 విలువైన జియో 4కె సెట్ టాప్ బాక్స్‌లను ఉచితంగా అందిస్తున్నారు. దీంతోపాటు 3 నెలల పాటు జియో సినిమా, జియో సావన్ యాప్‌లకు, ఓటీటీ యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

జియో గిగాఫైబర్ ప్లాన్లలో ఇండియాలో ఎక్కడికైనా ఉచిత వాయిస్ కాల్స్ చేసుకునే సదుపాయాన్ని అందిస్తున్నారు. అలాగే అన్ని ప్లాన్లలోనూ ఏడాదికి రూ.1200 విలువ గల ఉచిత టీవీ వీడియో కాలింగ్‌ను, మరో రూ.1200 విలువైన గేమింగ్ సదుపాయాన్ని, హోం నెట్‌వర్కింగ్, డివైస్ సెక్యూరిటీ (5 డివైస్‌లకు) సదుపాయాలను అందిస్తున్నారు. ఇక డైమండ్, ప్లాటినం, టైటానియం ప్లాన్లలో అదనంగా వీఆర్ ఎక్స్‌పీరియెన్స్, ప్రీమియం కంటెంట్ (ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీలు, స్పెషల్ స్పోర్ట్స్ కంటెంట్)ను అందిస్తున్నారు.

మొత్తం ఆరు రకాల ప్లాన్‌లు 
ఫైబర్‌ నెట్‌ సేవలకు మొత్తం ఆరు రకాల ప్లాన్‌లను రిలయన్స్‌ జియో ఆవిష్కరించింది. ఇందులో కనీస నెలవారీ చార్జీ(బ్రాంజ్‌ ప్లాన్‌) రూ.699 (స్పీడ్‌ 100 ఎంబీపీఎస్‌) కాగా, గరిష్టంగా రూ.8,499 (టైటానియం ప్లాన్‌-స్పీడ్‌ 1 జీబీపీఎస్‌) చార్జీ చేయనుంది. ఇంకా సిల్వర్‌ ప్లాన్‌ అయితే నెలకు రూ.849 (100 ఎంబీపీఎస్‌ స్పీడ్‌); గోల్డ్‌ ప్లాన్‌కు రూ.1,299 (స్పీడ్‌ 250 ఎంబీపీఎస్‌); డైమండ్‌ ప్లాన్‌కు రూ.2,499 (స్పీడ్‌ 500 ఎంబీపీఎస్‌); ప్లాటినం ప్లాన్‌కు రూ.3,999 (స్పీడ్‌ 1 జీబీపీఎస్‌) చొప్పున  చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆరు ప్లాన్‌లపైనా అదనంగా 18 శాతం జీఎస్‌టీ వర్తిస్తుంది.

ఏ ప్లాన్‌ తీసుకున్నా సేవలు పొందాలంటే ముందుగా (వన్‌టైమ్‌) రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రూ.1,500 సెక్యూరిటీ డిపాజిట్‌, రూ.1,000 నాన్‌-రిఫండబుల్‌ ఇన్‌స్టలేషన్‌ చార్జీల రూపంలో కంపెనీ వసూలు చేస్తుంది. కాగా, ఫెయిర్‌ యూసేజ్‌ పాలసీ(ఎఫ్‌యూపీ) కింద  డౌన్‌లోడ్‌ పరిమితిని గనుక దాటితే నెట్‌ స్పీడ్‌ 1 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. బ్రాంజ్‌ ప్లాన్‌లో డౌన్‌లోడ్‌ ఎఫ్‌యూపీ పరిమితి 100 జీబీ కాగా, అదనంగా మరో 50 జీబీ(ప్రారంభ ఆఫర్‌ కింద 6 నెలలు మాత్రమే ఇస్తారు) లభిస్తుంది.

బ్రాంజ్‌ ప్లాన్‌
కస్టమర్లకు నెలకు 100జీబీ ఉచిత డేటా లభిస్తుంది. దీంతోపాటు లాంచింగ్ సందర్భంగా మరో 50 జీబీ డేటాను అదనంగా అందిస్తున్నారు. 100 ఎంబీపీఎస్‌ స్పీడ్ తో అందుబాటులో ఉంటుంది. నెలకు ఈ ప్లాన్ కింద రూ.699 చెల్లించాలి.

సిల్వర్ ప్లాన్ 
సిల్వర్ ప్లాన్‌లో 200జీబీ నెలవారీ డేటా, 200 జీబీ అదనపు డేటా లభిస్తుంది. 100 ఎంబీపీఎస్‌ స్పీడ్ తో అందుబాటులో ఉంటుంది. నెలకు ఈ ప్లాన్ కింద రూ.849 చెల్లించాలి.

గోల్డ్‌ ప్లాన్
గోల్డ్ ప్లాన్‌లో 500జీబీ+250 జీబీ డేటా లభిస్తుంది. 250 ఎంబీపీఎస్‌ స్పీడ్ తో అందుబాటులో ఉంటుంది. నెలకు ఈ ప్లాన్ కింద రూ.1299 చెల్లించాలి.

డైమండ్ ప్లాన్
1250 జీబీ + 250 జీబీ డేటా లభిస్తుంది. 250 ఎంబీపీఎస్‌ స్పీడ్ తో అందుబాటులో ఉంటుంది. నెలకు ఈ ప్లాన్ కింద రూ.2499 చెల్లించాలి.

ప్లాటినం ప్లాన్
 2500 జీబీ డేటా లభిస్తుంది. 1జీబీపీఎస్ స్పీడ్ తో అందుబాటులో ఉంటుంది. నెలకు ఈ ప్లాన్ కింద రూ.3999 చెల్లించాలి.

టైటానియం ప్లాన్
5000 జీబీ నెలవారీ డేటా లభిస్తుంది.1జీబీపీఎస్ స్పీడ్ తో అందుబాటులో ఉంటుంది.నెలకు ఈ ప్లాన్ కింద రూ. 8499 చెల్లించాలి. వీటితోపాటు 3, 6, 12 నెలల వాలిడిటీ ఉన్న ప్లాన్లను కూడా జియో గిగాఫైబర్‌లో అందిస్తున్నారు. ఈ ప్లాన్లు అన్నింటిలోనూ ఇచ్చే డేటా అంతా అయిపోయాక ఇంటర్నెట్ స్పీడ్ 1 ఎంబీపీఎస్‌కు పడిపోతుంది. 30 రోజులు కాగానే బిల్ సైకిల్ మారి, స్పీడ్, డేటాలు యథావిధిగా లభిస్తాయి.

సేవలు పొందడం ఎలా...
జియో ఫైబర్‌ నెట్‌ కనెక‌్షన్‌ తీసుకోవాలంటే ముందుగా www.jio.com వెబ్‌సైట్‌ ద్వారా లేదా మైజియో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని సంబంధిత వివరాలన్నీ ఇచ్చి రిజిస్టర్‌ చేసుకోవాలి. కస్టమర్‌ ఇచ్చిన అడ్రస్‌ పరిధిలో జియో ఫైబర్‌ అందుబాటులో ఉంటే.. సర్వీస్‌ ప్రతినిధులు సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటారు.

జన రంజకమైన వార్తలు