భారత దేశ గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు సౌర విద్యుత్ అందిస్తున్నసింపా నెట్ వర్క్ తాజాగా సోలార్ పవర్డ్ శాటిలైట్ టీవీ స్టేషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇండియాలో ఇలాంటిది ఇదే ప్రథమం.ఎన్నో ప్రత్యేకతలున్న ఈ సోలార్ శాటిలైట్ టీవీ నెట్ వర్క్ పై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతానికి దీన్నుంచి పరిమిత స్థాయిలోనే చానల్స్ అందిస్తున్నా ముందుముందు అన్ని చానళ్లూ అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎలా పనిచేస్తుంది...
ఈ కిట్ లో ఒక 20 అంగుళాల ఎనర్జీ ఎఫిషియెన్సీ ఎల్ ఈడీ టీవీ ఉంటుంది. శక్తివంతమైన బ్యాటరీ, ఎడ్వాన్స్డ్ సోలార్ చార్జి కంట్రోలర్లు ఉంటాయి. ఈ మొత్తం వ్యవస్థను ఒక 80 వాట్ల సోలార్ ప్యానల్ కు కనెక్టు చేస్తారు. ఈ ప్యానల్ ను ఇంటిపైకప్పు పై అమర్చుకోవాలి. ఈ సోలార్ ప్యానల్ ను రిమోట్ తో నియంత్రించవచ్చు. దీని సేవల కోసం కస్టమర్లు నెల రోజులు ముందుగానే డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఆ కాలానికి సేవలు ముగిసిన తరువాత మళ్లీ రీచార్జి చేయాల్సి ఉంటుంది.
ధర మాటేమిటి..
ఈ మొత్తం యూనిట్ విలువ రూ.25 వేలు. కానీ... గ్రామీణ పేదలు అంత మొత్తం ఒకేసారి చెల్లించలేరు కాబట్టి సులభ వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పిస్తున్నారు. భారత్ లో తొలుత దీన్ని ఉత్తర్ ప్రదేశ్ లో అందుబాటులోకి తెస్తున్నారు. ఆ తరువాత బీహార్, బెంగాల్, ఒడిశా, అస్సాం, జార్ఖండ్ లోనూ ప్రవేశ పెడతారు.