చేతికి వాచ్.. దానిలో ఓ సిమ్ కార్డ్.. ఆన్‌లైన్ రీఛార్జి.. అంతే ఎక్కడా ఆగి టికెట్ కొనే పనిలేకుండా ఢిల్లీ మెట్రో రైళ్లలో జామ్ జామ్మని తిరిగేయొచ్చు. అవును ఢిల్లీ మెట్రో రైలు ప్రయాణికుల కోసం ఓ ఆస్ట్రేలియన్ వాచ్ కంపెనీ ఈ సిమ్ బేస్డ్ వాచీని తయారుచేసింది. దీన్ని గేట్ దగ్గర టచ్ చేస్తే చాలు పేమెంట్స్ రిసీవ్ చేసుకుని మీ ప్రయాణానికి నేరుగా యాక్సెస్ ఇచ్చేస్తుంది.
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) తమ ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత సులభంగా మార్చడానికి ఎలక్ట్రానిక్ టికెటింగ్ గేట్‌వేలను డెవలప్ చేస్తోంది. దీనిలో భాగంగా వాచ్ 2 పే (Watch2Pay)లను అనుమతించనుంది. ఈ వాచ్‌ను మెట్రో స్టేషన్లలో ఉండే ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ (ఏఎఫ్‌సీ) గేట్ల స్క్రీన్‌కు టచ్ చేస్తే చాలు మెట్రో రైలులో జర్నీ చేయొచ్చు.
ఎలా పని చేస్తుంది?
ఈ కామర్స్ సైట్లలో దొరికే ఈ Watch2Pay వాచ్‌లను లాక్స్ అనే ఆస్ట్రేలియన్ కంపెనీ తయారుచేసింది. ఈ వాచ్‌లో సిమ్ కార్డ్ ఉంటుంది. దీన్ని కావాలంటే రిమూవ్ చేయొచ్చు. ఈ కార్డ్‌ను మెట్రో స్మార్ట్ కార్డులు లేదా రీ ఛార్జ్ కార్డు టెర్మినల్స్‌లో రీ చార్జి చేయించుకోవచ్చు. ఏఎఫ్‌సీ స్క్రీన్‌కు టచ్ చేయగానే మీ అకౌంట్‌లోంచి ఆ అమౌంట్ కట్ అవుతుంది. హైదరాబాద్ మెట్రో రైల్ కంపెనీతో కూడా ఫేర్ పేమెంట్స్‌కు సంబంధించి ఈ వాచ్ కంపెనీ రెండేళ్ల క్రితమే ఒప్పందం కుదుర్చుకుంది. కాబట్టి హైదరాబాద్ మెట్రో అందుబాటులోకి రాగానే అక్కడ కూడా ఈ వాచ్ 2 పే సౌకర్యం వచ్చే అవకాశం ఉంది.